Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 67

Rama breaks the Siva's Bow !!


|| Om tat sat ||

జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివమ్ ||

"మహాముని అయిన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని రామునకు ధనస్సును ను చూపించుడు అని ఆ రాజుతో చెప్పెను".

బాలాకాండ
అఱువది ఏడవ సర్గము

మహాముని అయిన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని రామునకు ధనస్సును చూపించుడు అని ఆ రాజుతో చెప్పెను.

అప్పుడు జనక మహారాజు సామంతులను దివ్యమైన గంధముతోనూ మాలలతోనూ అలంకరించబడిన ధనస్సు ను తీసుకురండు అని ఆదేశము ఇచ్చెను. జనకునిచేత అదేశించబడిన వారై ఆ మంత్రులు నగరము వెళ్ళిరి. రాజాజ్ఞతో ఆధనస్సును ముందు ఉంచుకొని బయల్దేరిరి. మహా బలశాలురైన ఇదువేలమంది మనుష్యులు ఎనిమిది చక్రములు గల మంజూషమును అతి కష్ఠముతో తీసుకు వచ్చిరి.

ఆ రాజుయొక్క మంత్రులు ఆ ధనస్సు ఎక్కడవుందో ఆ మంజూషమును తీసుకు వచ్చి దేవులతో సమానుడగు జనకునితో ఇట్లు పలికిరి
"ఓ రాజేంద్ర ! ఓ రాజన్ !ఓ మిథిలాధిపా ! ఈ రాజులందరిచే పూజింపబడు శ్రేష్ఠమైన ధనస్సు ను మీ ఇచ్చానుసారము చూపించవచ్చును".
వారి మాటలను విని రాజు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుడు ఆ ఇద్దరూ రామలక్ష్మణులతో ఇట్లు పలికెను."ఓ బ్రహ్మన్ ! ఈ ధనస్సు మాపూర్వీకులచే పూజింపబడినది. పూర్వము మహావీరులగు రాజులు ఎక్కుపెట్టుటకు అశక్తులైరి. సురగణములలో కాని అసురలలోకాని , రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు మహోరగములలో ఎవరు ఆ ధనస్సును ఎక్కుపెట్టుటకుగాని సంధించుటకు గాని అల్లే తాడును లాగుటకు కాని , చివరికి ధనస్సు ఎత్తుటకు కాని సమర్థులు కాలేకపోయిరి. ఇంక మనుష్యుల సంగతి చెప్పనేల. ఓ మహాభాగా ! ఓ మునిపుంగవ ! అట్టి ఈ శ్రేష్ఠమైన ధనస్సు ఈ రాజపుత్రులు చూచుటకు తీసుకు రాబడినది" .

జనకుడు చెప్పిన ఆమాటలు విని ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు రామునితో ,"నాయనా రామా ధనుస్సును చూడుము " అని చెప్పెను.

ఆ బ్రహ్మర్షి యొక్క మాటలతో రాముడు ధనస్సు వున్న మంజూష దగ్గరికి వచ్చి ధనస్సును చూచి పిమ్మట ఇట్లు పలికెను.

"ఓ బ్రహ్మన్ ! ఈ శ్రేష్ఠమైన ధనస్సును చేతితో స్పృశించుచున్నాను. ఏత్తి ఎక్కుపెట్టుటకు ప్రయత్నము చేసెదను"

ఆ జనక మహారాజు మునిపుంగవుడగు విశ్వామిత్రుడు రామునితో సరే అని పలికిరి.

ఆ విశ్వామిత్రుని యొక్క మాటతో వేలకొలదీ రాజులు చూచుండగా ఆ రఘునందనుడు ధనస్సుని మధ్యభాగములో అవలీలగా పట్టుకొనెను. నరశ్రేష్ఠుడు మహాయశస్సు గల ఆ ధర్మాత్ముడు ధనస్సుని ఎక్కుపెట్టి సంధించెను. ఆ ధనస్సు మధ్యలో విరిగిపోయెను. ఆ శబ్దము నిర్ఘాతపెట్టు సమముగా బ్రహ్మాండముగా నుండెను. భూమి కంపించెను, మహాపర్వతములు బ్రద్దలైనట్లు అనిపించెను. ఆ మునివరుడు , మహరాజు ,రామలక్ష్మణూలు తప్ప మిగిలిన వారందరూ ఆ శబ్దముతో మూర్చిల్లి పడిపోయిరి.

జనులు ఆ మూర్చనుండి తేరుకొనిరి. జనక మహారాజు కూడా కుదుటపడిన మనస్సుతో అంజలి ఘటించి వాక్యజ్ఞుడైన ఆ మునిపుంగవునితో ఈ మాటలు పలికెను. "ఓ భగవన్ ! అత్యద్భుతము అయిన , అలోచనలకు అందనిది, అట్లు అగునని తలంచని దశరథాత్మజుడైన రాముని పరాక్రమమును నేను చూచితిని సీత దశరథాత్మజుడగు రాముని భర్తగా పొంది , నా కుమార్తె జనకుని కులప్రతిష్ఠ పెంచ గలదు. ఓ కౌశికా ! సీత వీర్యశుల్కము అన్న నా ప్రతిజ్ఞ సత్యమైనది. నా ప్రాణములతో సమానమైన సీత రామునికి ఇయ్యతగినది. ఓ బ్రహ్మన్ ! మీకు శుభమగుగాక ! ఓ కౌశికా ! మీ అనుమతితో నా మంత్రులు త్వరగా పోవు రథములపై శీఘ్రముగా అయోధ్య వెళ్ళెదరు. అయోధ్యానగరము వెళ్ళి ,వినమ్ర వచనములతో వీర్య శుల్క ప్రదానమును చెప్పెదరు. ఆ మహరాజుకు మునిరక్షణలో నున్నకాకుత్‍స్థులను ఇద్దరి గురించి చెప్పెదరు. ప్రీతిచెందిన ఆ మహరాజు ను మానగరమునకు తీసుకు వచ్చెదరు".

కౌశికుడు అటులనే అని అనెను.

జనక మహారాజు మంత్రులతో మాట్లాడెను."ఆ ధర్మాత్ముడు జరిగిన వృత్తాంతము చెప్పుటకు అలాగే ఆ మహారాజుని తీసుకు వచ్చుటకు కార్య దక్షులను అయోధ్యా నగరమునకు పంపెను".

ఈ విథముగా బాలకాండలోని అరువది ఏడవ సర్గము సమాప్తము

||ఓమ్ తత్ సత్ ||

అయోధ్యాయాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ |
యథావృత్తం సమఖ్యాతుం ఆనేతుం చ నృపం తథా ||

"ఆ ధర్మాత్ముడు జరిగిన వృత్తాంతము చెప్పుటకు అలాగే ఆ మహారాజుని తీసుకు వచ్చుటకు కార్య దక్షులను అయోధ్యా నగరమునకు పంపెను".
|| ఓం తత్ సత్ ||

|| Om tat sat ||